భారత్‌లో మే 3 వరకు లాక్‌డౌన్‌: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

  • కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
  • కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
  • భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు.
  • అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయని మోదీ తెలిపారు.
  • ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నివాళని చెప్పారు.
  • లాక్‌డౌన్ అమలు ఉండగానే ఉగాది నుంచి విశూ వరకు పండుగలు జరుపుకున్నామని ఆయన అన్నారు.

మే 3 వరకు సహకరించాలి

  • మే 3 వరకు దేశ పౌరులు అందరూ సహకరించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు.
  • త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు.
  • పరిస్థితులు చేజారిపోయే వరకు చూస్తూ ఊరుకోవద్దని ఆయన చెప్పారు.
  • దేశంలో కొవిడ్‌-19 కేసులు 100 నమోదు కాకముందే విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, క్వారంటైన్‌ వంటి చర్యలు తీసుకున్నారు.
  • దేశంలో 550 కేసులు నమోదు కాగానే 21 రోజుల లాక్‌డౌన్‌ విధించామని చెప్పారు.

ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు అనుమతులు

  • ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు.
  • అయితే, ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆ  అనుమతులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు.
    లాక్‌డౌన్‌ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని చెప్పారు.
  • గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత సాయం అందిస్తున్నామని చెప్పారు.
  • ఆహార వస్తువులు, మందుల సరఫరా వంటివాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.
  • ఈ విషయంలో ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
  • పేదలు, కూలీలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు.

ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయొద్దు

  • ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని మోదీ అన్నారు.
  • ఒక్క హాట్‌స్పాట్‌ కూడా పెరగకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు.
  • ఈ రెండో దశ పరీక్షలో దేశమంతా సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.
  • కొత్తగా ఎవరూ కరోనా బారిన పడకుండా ఉండాలన్న లక్ష్యంతో పని చేద్దామని అన్నారు.
  • ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.
  • పరిశ్రమల్లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయొద్దని ఆయన కోరారు.

Source