సూట్ కేసులో బాయ్ ఫ్రెండ్… లాక్ డౌన్ వేళ ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యువతి ప్లాన్!

  • కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతున్న వేళ, తన బాయ్ ఫ్రెండ్ ను అపార్ట్ మెంట్ లోకి ఎలాగైనా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఓ టీనేజ్ యువతి వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టింది. తన స్నేహితుడిని పెద్ద సూట్ కేసులో పెట్టి తీసుకుని వస్తూ అడ్డంగా దొరికిపోయింది.
  • కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కరోనా భయంతో ఓ అపార్టుమెంట్ కమిటీ బయటి వారు లోపలికి రావడానికి వీల్లేదని నిబంధన విధించింది.
  • అదే అపార్టుమెంట్ లో ఉంటున్న ఓ యువతి, తన స్నేహితుడిని ఇంటికి ఆహ్వానించింది. అయితే, అతను వచ్చేందుకు వీలు లేకపోవడంతో ప్లాన్ వేసింది.
  • అతన్ని ఓ పెద్ద సూట్ కేసులో ఉంచింది. దాన్ని అతి కష్టం మీద అపార్ట్ మెంట్ పరిధిలోకి తీసుకుని వచ్చింది.
  • అంత పెద్ద సూట్ కేసు, ఆమె ప్రవర్తనను చూసిన కొందరికి ఎక్కడో అనుమానం కలిగింది. ఆ సూట్ కేసును తెరచి చూపించాల్సిందేనని పట్టుబట్టా, ఆమెతో తెరిపించి, అవాక్కయ్యారు.
  • ఆ వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి, వారిద్దరినీ స్టేషన్ కు తరలించారు.
  • వీరిద్దరూ కలిసి చదువుకుంటున్నారని గుర్తించి, వారి తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి, స్టేషన్ కు పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
  • మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపామని, ఈ విషయంలో ఎటువంటి కేసూ రిజిస్టర్ చేయలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Source