లాక్‌డౌన్‌లోనూ మత్తులో జోగుతున్న జనం.. హైదరాబాదులో యథేచ్ఛగా విక్రయాలు

  • లాక్‌డౌన్‌లోనూ హైదరాబాద్‌లోని మందుబాబులు మత్తులో జోగుతున్నారు. నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలను మాత్రం ఇవి అడ్డుకోలేకపోతున్నాయి.
  • మద్యం దుకాణదారులు, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని రహస్యంగా దందా నిర్వహిస్తున్నారు.
  • లాక్‌డౌన్ ప్రారంభమైన రెండో రోజు నుంచే నగరంలో మద్యం విక్రయాలు మొదలైనట్టు తెలుస్తోంది.
  • తాజాగా, మల్కాజిగిరి లోని ఏడు ప్రాంతాల్లో ఈ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇటీవల ఓ వ్యక్తి కారులో భారీగా మద్యం సీసాలు తరలిస్తూ పట్టుబడ్డాడు.
  • అల్వాల్, బొల్లారం నుంచి కారులో రోజు విడిచి రోజు మద్యాన్ని తీసుకెళ్లి ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
  • అర్ధరాత్రి వేళ గోదాములు, దుకాణాలను తెరిచి అందులోని మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి రహస్యంగా దాస్తున్నారు. అనంతరం వాటిని ఏజెంట్లతో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.
  • మేడిపల్లిలోని ప్రియా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఇలాంటి దందాకు పాల్పడగా ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
  • కాగా, అక్రమంగా బయటకు తీసుకొచ్చిన మద్యాన్ని డిమాండ్‌ను బట్టి భారీగా విక్రయిస్తున్నారు. మంచి బ్రాండ్ అయితే ఫుల్ బాటిల్‌ను రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు.
  • ఒక్కో సీసాకు రూ. 200 నుంచి రూ. 500 వరకు కమిషన్ ఇస్తున్నట్టు పట్టుబడిన విద్యార్థి ఒకరు చెప్పడం చూస్తుంటే దందా ఏ మేర సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

Source