తగ్గినట్టే తగ్గి.. తెలంగాణలో విజృంభించిన కరోనా!

 • తెలంగాణలో గత బుధవారం నుంచి తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు, తిరిగి విజృంభించడం ప్రజల్లో ఆందోళన పెంచింది.
 • 24 గంటల వ్యవధిలో రెండు జిల్లాల్లో 22 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.
 • ఇదే సమయంలో వికారాబాద్‌ జిల్లాలో తొలి మరణం నమోదైంది. శని, ఆదివారాల్లో పాజిటివ్ వచ్చిన కరోనా కేసుల్లో అత్యధికం కాంటాక్టు కేసులే కావడం గమనార్హం.
 • ఇక, మరోసారి కరోనా విజృంభించడానికి కారణాలను అన్వేషించిన అధికారులు, మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో జరిగిన ఆలస్యమేనని అభిప్రాయపడుతున్నారు.
 • ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు తెలంగాణ నుంచి 1089 మంది వెళ్లినట్లు తెలుసుకున్న అధికారులు, యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి, వారిని ట్రేస్ చేసే పనులు ప్రారంభించగా, కొన్ని చోట్ల వారిని గుర్తించడం ఆలస్యమైంది.
 • ఇప్పుడు కాంటాక్ట్ కేసులు పెరగడానికి అదే కారణమని అధికారులు అంటున్నారు.
 • హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, మర్కజ్ కు వెళ్లి వచ్చి, ఆపై వికారాబాద్ లో తాను నిర్వహిస్తున్న మదార్సాకు వెళ్లాడు.
 • అతనికి కరోనా పాజిటివ్ రాగా, అతని నుంచే, 13 మందికి వ్యాధి సంక్రమించిందని అధికారులు వెల్లడించారు.
 • జిల్లా పరిధిలో ఇటీవల నమోదైన 21 కేసుల్లో 8 మంది మర్కజ్ కు వెళ్లిన వారేనని స్పష్టం చేశారు.
 • ఇక సూర్యాపేట జిల్లాలో కూరగాయల వ్యాపారం చేసుకునే మరో వ్యక్తి, ఢిల్లీకి వెళ్లి వచ్చి, లాక్ డౌన్ కు ముందు వ్యాపారం నిర్వహించగా, అతని నుంచి 10 మందికి కరోనా సోకింది. వారిలో అతని కుమార్తె కూడా ఉంది.
 • అతని వద్ద నుంచి కూరగాయలు కొన్నవారిని, దగ్గరగా మెలిగిన వారిని అధికారులు ఇప్పుడు క్వారంటైన్ చేస్తున్నారు. కాంటాక్టు కేసులు పెరుగుతూ ఉండటంపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు అధికారులు వెల్లడించారు.

Source