లండన్‌లో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ జిల్లా విద్యార్థి

  • పై చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందాడు.
  • జిల్లాలోని ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన కాయిత సతీశ్ (26) గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజాము నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురయ్యాడు.
  • నిద్రిస్తున్న మంచం పై నుంచి కిందపడిపోవడంతో గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
  • ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీశ్‌ను రాయల్ ప్రిస్టిన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
  • సతీశ్ మృతి విషయాన్ని అతడి స్నేహితులు రాంనగర్‌లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కుమారస్వామి, శారదకు వీడియో కాల్ ద్వారా తెలిపారు. విషయం విన్న వారు గుండె పగిలేలా రోదించారు.
  • ఇటీవలే కుమారుడితో మాట్లాడామని, కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించామని, అంతలోనే ఇలా జరిగిందని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు.
  • కాగా, సతీశ్ అన్న రంజిత్ అమెరికాలో ఉండగా, తమ్ముడు దేవేందర్ లండన్‌లోనే మరో ప్రాంతంలో ఎంఎస్ చదువుతున్నాడు.
  • సతీశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాల్సిందిగా బాధిత తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Source