’కరోనా’ ఎఫెక్ట్ ..దేశ వ్యాప్తంగా ‘సురక్ష స్టోర్స్’ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం?

  • ‘కరోనా’ కట్టడి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు యావత్తు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
  • ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
  • ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తగు ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు నిత్యావసరాలను అందించే నిమిత్తం దేశ వ్యాప్తంగా ‘సురక్ష స్టోర్స్’ ను ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
  • దేశ వ్యాప్తంగా 20 లక్షల సురక్ష స్టోర్స్ ను ఏర్పాటు చేసే నిమిత్తం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.
  • ‘సురక్ష స్టోర్స్’ ద్వారా నిత్యావసరాలు, వినియోగదారులు ఉపయోగించే వస్తువులు, దుస్తులు, సెలూన్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తోంది.
  • స్థానికంగా ఉండే కిరాణా దుకాణాలను శానిటైజ్డ్ అవుట్ లెట్స్ గా మార్చి వాటికి ‘సురక్ష స్టోర్స్’ గా మార్చాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది.
  • ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రైవేట్ ఫర్మ్స్ తో ప్రభుత్వం ముందు కెళ్తుందని, కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తయారీ యూనిట్ల నుంచి రిటైల్ అవుట్ లెట్ల వరకూ సప్లయ్ చైన్ మొత్తం తగు ప్రమాణాలు పాటించేలా చూస్తుందని తెలుస్తోంది.
  • వచ్చే 45 రోజుల్లో ‘సురక్ష స్టోర్స్’ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందని సంబంధిత వర్గాల సమాచారం.
  • ‘సురక్ష స్టోర్’ కావడానికి, రిటైల్ దుకాణం నిర్దేశించిన ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి.
  • దుకాణం వెలుపల, బిల్లింగ్ కౌంటర్ల వద్ద 1.5 మీటర్ల సామాజిక దూరం, వినియోగదారులు దుకాణాలలోకి ప్రవేశించే ముందు సానిటైజర్ లేదా హ్యాండ్‌వాష్ సదుపాయం, మొత్తం సిబ్బందికి మాస్క్ లు, రోజుకు రెండుసార్లు శానిటైజేషన్ చేయడం లాంటివి పాటించవలసిన అవసరం ఉంటుంది.
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్)ను అనుసరించి కోవిడ్-19 ప్రోటోకాల్స్ పై అవగాహన కల్పించేందుకు సురక్ష స్టోర్స్, సురక్ష సర్కిల్ కు ఆన్ లైన్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
  • కాగా, ‘సురక్ష స్టోర్స్’ విషయమై వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్ కుమార్ అగర్వాల్ ను మీడియా ప్రశ్నించగా ఇందుకు సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

Source