కరోనా లాక్ డౌన్ సమయంలో మూడు జోన్లుగా భారత్ విభజన

  • దేశంలో కరోనా వ్యాప్తి, సహాయకచర్యలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది.
  • కరోనా వ్యాప్తి తీవ్రతను అనుసరించి భారత్ ను మూడు జోన్లుగా విభజించాలన్నది వాటిలో ముఖ్యమైనది.
  • ఒక ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలన్న ప్రతిపాదన రాగా, దీనికి అనేక మంది ముఖ్యమంత్రులు అంగీకారం తెలిపినట్టు సమాచారం.
  • గ్రీన్ జోన్ అంటే… ఎలాంటి కరోనా కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చుతారు. ఈ జోన్ లో లాక్ డౌన్ పూర్తిగా సడలించే అవకాశాలు ఉంటాయి.
  • ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ఒక్క కొవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చనున్నారు.
  • ఇక ఆరెంజ్ జోన్ విషయానికొస్తే…. 15 కంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండి, పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేని జిల్లాలను ఆరెంజ్ జోన్ గా పరిగణిస్తారు.
  • ఈ ఆరెంజ్ జోన్ జిల్లాల్లో పరిమిత స్థాయిలో ప్రజారవాణా, వ్యవసాయపనులు, ఇతర నిత్యావసర కార్యకలాపాలకు అనుమతిస్తారు.
  • ఇక, 15 కేసుల కంటే మించి నమోదైన ఏ ప్రాంతాన్నైనా రెడ్ జోన్ గా పరిగణిస్తారు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలైనా నిషిద్ధం. లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది.
  • ఎల్లుండితో తొలి దశ లాక్ డౌన్ ముగియనుండగా, ఈ లోపే ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని, జోన్ల వారీగా లాక్ డౌన్ సడలింపుపై స్పష్టమైన ప్రకటన చేస్తారని కేంద్ర వర్గాలు అంటున్నాయి.
  • ప్రస్తుతానికి భారత్ లో 8,356 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 7,367 మంది క్రియాశీలక రోగులుగా ఉన్నారు. 273 మంది కరోనాతో మరణించగా, 716 మంది కోలుకున్నారు.

Source