మారటోరియం ఆదేశాలను పట్టించుకోని బ్యాంకులు : యథావిధిగా ఈఎంఐల కోత

  • కరోనా కష్టకాలం, లాక్‌డౌన్‌ ఇబ్బందుల నేపథ్యంలో సగటు మనిషిపై ఆర్థికభారం పడకుండా ఉండేందుకు బ్యాంక్‌ల పెద్దన్న రిజర్వ్‌బ్యాంక్‌ విధించిన మూడు నెలల మారటోరియంను జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
  • పర్సనల్‌, హోం, వాహనం…ఇలా రుణం ఏదైనా మూడు వాయిదాలను కట్టక్కర్లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
  • ఈ విషయంలో ఖాతాదారుడు స్వచ్ఛందంగా ‘తనకు మారటోరియం అక్కర్లేదు’ అని లిఖితపూర్వకంగా రాసిస్తే తప్ప ఆయా అకౌంట్ల నుంచి డబ్బును కట్‌ చేయవద్దని ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది.
  • కానీ ఒక్క బ్యాంకు దీన్ని అమలు చేసినట్టు కనబడలేదు. ప్రైవేటు బ్యాంకుల సంగతి పక్కన పెడితే కనీసం జాతీయ బ్యాంకులు కూడా ఆర్‌బీఐ ఆదేశాలను పట్టించుకోక పోవడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.
  • ‘ఆర్‌బీఐ ప్రకటించింది కదా అని ఈఎంఐ కోసం ఉంచిన మొత్తం ఇంటి అవసరాలకు వాడుకున్నాం.
  • తీరా ఇప్పుడు ఈఎంఐ కట్టనందున జరిమానా విధిస్తున్నట్టు, చెక్‌బౌన్స్‌ అయినందున జరిమానా చెల్లించాలంటూ మెసేజ్‌లు వస్తున్నాయి’ అంటూ పలువురు ఖాతాదారులు వాపోతున్నారు.
  • ఇదేంటని అడిగితే కట్‌ అయిన డబ్బు తిరిగి ఇవ్వాలంటే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని చెబుతున్నారని, మెయిల్‌ పెట్టాలని అంటున్నారని, పెడితే దానికి సమాదానమే ఉండడం లేదని పలువురు వాపోతున్నారు.

Source